నామని సుజనాదేవి దాదాపు పదిహేనేళ్లుగా కథలు వ్రాస్తున్నది. 2009 నుండి ఇప్పటివరకు నాలుగు కథా సంపుటాలు ప్రచురించింది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వల్ల పరిచయమై స్నేహ పరిధిలోకి వచ్చిన వాళ్లలో తాను కూడా ఒకరు. ఇప్పుడు ప్రచురిస్తున్న “కొత్త వెల్లువ మనసు వెన్నెల” సంపుటికి పరిచయ వాక్యాలు వ్రాయటం ఆ స్నేహం వల్లనే. ఈ సంపుటంలో కథలు ఇరవై అయిదు. ఇవన్నీ 2019 నుండి ఈ మూడు నాలుగేళ్ల కాలంలో వ్రాయబడ్డాయి. ఈ కాలపు విపత్తులలో కరోనా సుజనా దేవిని బాగా వెంటాడింది. ఏడు కథలు కరోనా కేంద్రంగా వచ్చినవే. సాధారణ మధ్యతరగతి కోణం నుండి వ్రాయబడిన కథలు ఇవి. కరోనా కాలపు భయాలు , లాక్ డౌన్ అందరినీ ఇళ్లకు బందీలుగా చేస్తే అది అవ్యవస్థీకృత రంగాలలో పని చేసే ఎందరికో ఉపాధి లేకుండా చేయటం పెద్ద విషాదం. బయటకు పోయి ఏదో ఒక పని చేసుకోనిదే పొట్టగడవని వర్గం గురించిన స్పృహ సుజనాదేవికి ఉంది. ఇళ్ళల్లో పనిచేసే వాళ్లకు నెల జీతం ఇవ్వటం వాళ్ళ అవసరాలు కనిపెట్టి సహాయపడటం దగ్గర నుండి బయట కూడా అలాంటి వాళ్లకు అవసరమైన ఆర్ధిక సహాయానికో,సేవలు అందించటానికో మధ్యతరగతి సంసిద్ధం అవుతుం డటాన్ని ఆమె కథలు చెప్పాయి. కరోనా త్వరగా వ్యాపించే వ్యాధి కనుక కరోనా బాధితులను వాళ్ళు ఉన్న ఇంటిని బహిష్కరించినట్లుగా చేసే మనుషుల అతిభయాలు అమానవీయమైనవి అంటుంది సుజనా దేవి. తగిన జాగ్రత్తలు తీసుకొంటూ తోటివారిని ఆదుకోవలసిన ధర్మం గురించి చెప్తుంది. మధ్యతరగతి సంస్కరణ భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి ఈ కథలు.
Thank you for visiting our website. Would you like to provide feedback on how we could improve your experience?
This site does not use any third party cookies with one exception — it uses cookies from Google to deliver its services and to analyze traffic.Learn More.